మా`ప్రత్యేక` పోరు ఆగదు
“ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ.. తెస్తామని టీడీపీలు తమ మేనిఫెస్టోలలో కూడా పెట్టుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి ర్యాలీలోను, విశాఖ సభలో కూడా స్వయంగా చెప్పారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం పూర్తిగా మాట మార్చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ఆయన అంటున్నారు. కానీ వాస్తవానికి అది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంజీవనే అవుతుంది. అందువల్ల దాన్ని తప్పనిసరిగా ఇచ్చి తీరాలి“ అని వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న రాజ్యసభలో డిమాండ్ చేశారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లుపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రప్రదేశ్ ను విభజించింది ఎంత వాస్తవమో.. ఏపీకి అన్యాయం చేసిందన్నది కూడా అంతే నిజం అన్నారు.
రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20వ తేదీన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు పై విస్తృతంగా చర్చ జరిగినప్పుడు ప్రధానమంత్రి స్వయంగా 6 హామీలు ఇచ్చారని, వాటిలో ఒకటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని పేర్కొన్నారు. ప్రధాని స్వయంగా ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నప్పుడు వెంకయ్య నాయుడు ఐదేళ్లు సరిపోదని, పదేళ్లు ఇవ్వాలని అడిగినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వం నిరంతరం ఉంటుందని, పార్టీలు అధికారంలోకి రావచ్చు, పోవచ్చని ఆర్థికమంత్రి చెప్పారని, అలాంటప్పుడు ప్రభుత్వం నిరంతరం ఉంటే.. నాటి ప్రధాని ఇచ్చిన హామీని నేటి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే.. సభాహక్కుల ఉల్లంఘన అవుతుందా అనే అనుమానం కూడా తనకు ఉందని పేర్కొన్నారు. ఏదేమైనా ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాను పట్టించుకోకపోయినా తాము మాత్రం ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొనడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.