Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

War of Words between YCP & TDP..

By   /  March 4, 2016  /  Comments Off on War of Words between YCP & TDP..

    Print       Email

tdp flag with ycp flag new

వైసీపీ – టీడీపీ నేతల మాటల యుద్ధం..

InCorpTaxAct
Suvidha

 

అమరావతిలో టీడీపీ నేతలు భారీగా భూములు కొన్నారని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు ఎదురు దాడికి దిగారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. అంతేకాదు.. ఏపీ రాజధానిలో భూముల కొనుగోలు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ లా మారిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ సహా పలువురు మంత్రులు, పార్టీ నేతలు అమరావతి ప్రాంతంలో భూములను కొనుగోలు చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించడానికే ముందే భూములు కొనుగోలు చేసి బినామీల పేరున పెట్టారని.. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని వెల్లడించారు.

 

అయితే వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను అదేస్థాయిలో టీడీపీ నేతలు తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు రాజధాని ప్రాంతంలో భూములు లేవని మంత్రులు ప్రత్తిపాటి పుల్లరావు, మంత్రి నారాయణ అన్నారు. అలాగే దేవినేని ఉమా కూడా ఈ విషయంపై స్పందించారు. తనకు ఆ ప్రాంతంలో అసలు భూమి లేదన్నారు. ఇక పయ్యావుల కేశవ్ అయితే ప్రతిపక్ష నేత జగన్ పై మండిపడ్డారు. తాను తన కొడుకు పేరు మీద మగాడిలా కొన్నానని అన్నారు. రాజధాని ప్రకటనను అసెంబ్లీలో సెప్టెంబర్ లోనే చేశారని అన్నారు. అనంతరం రెండు నెలల తర్వాత తాను భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అవసరమైతే దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఆయనకు వైసీపీ నేత అంబటి రాంబాబు రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు. తాను కేశవ్ చేసిన సవాల్ స్వీకరిస్తున్నానని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ దగ్గరైనా సరే.. లేకపోతే ఉరవకొండలో అయినా సరే తాను సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ చేశారు.

 

మరో టీడీపీ కీలక నేత మురళీ మోహన్ కూడా వైసీపీ నేతల ఆరోపణలపై స్పందించారు. తాను ఎప్పటినుంచో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నానని చెప్పారు. తాను చంద్రబాబుకు ఏ మాత్రం బినామీ కాదన్నారు. తనకు చంద్రబాబుతో ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు లేవని చెప్పారు. కేవలం అధికార పక్షంపై ఆరోపణలు చేయడమే విపక్షం ఎజెండాగా పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు.

 

అయితే మరో వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాజధానిలో భూముల కొనుగోలు వ్యవహారంపై రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. ఇక శాసన సభ సమావేశాల్లో కూడా ఈ అంశంపైనే చర్చలకు పట్టుబట్టాలని వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ సెషన్స్ ఈ సారి మరింత వాడీవేడిగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →