బాబు ఎందుకలా చేస్తున్నారు?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అగ్రవర్గాలకే పెద్దపీట వేస్తున్నారా? సొంతపార్టీ దళిత మంత్రులను కూడా పట్టించుకోవడం లేదా? బీజేపీ మెప్పు పొందేందుకు తంటాలు పడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు కొంతమంది టీడీపీ నాయకులే. దళితులపై బాబు వివక్షత చూపుతూనే ఉన్నారని మండిపడుతున్నారు. ఇంతకీ విషయమేమిటంటే… పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు మంత్రులుండగా అందులో ఒకరు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరొకరు గనులు – స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఎగురవేసే అవకాశం చేసే హ్యాట్రిక్ ఛాన్స్ కూడా మాణిక్యాలరావుకే దక్కింది. ఇప్పటివరకూ రెండుసార్లు ఆయనకే ప్రొటోకాల్ బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం కూడా బీజేపీ మంత్రికే చాన్స్ ఇచ్చింది. దీంతో టీడీపీ – బీజేపీ మధ్య నెలకొన్న విభేదాల దృష్ట్యా ఈసారైనా టీడీపీకి చెందిన దళిత మహిళా మంత్రి పీతల సుజాతకు ఆ అవకాశం కల్పిస్తుందన్న వారి ఆశ నిరాశ అయిందంటున్నారు. అందుకు భిన్నంగా మాణిక్యాలరావుకే జెండా వందనం బాధ్యతను అప్పగించడం ద్వారా బీజేపీపై ఉన్న ప్రేమను టీడీపీ మరోసారి వెల్లడించినట్లైందనే చర్చ సాగుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుజాత వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కోస్తా జిల్లాల్లో ఏకైక దళిత మహిళా మంత్రిగా చంద్రబాబు కేబినెట్ లో కొనసాగుతున్న ఆమెను పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పనితీరులో మొదటి స్థానంలో నిలిచినా ప్రొటోకాల్ లో చివరి స్థానంలో ఉంచడం ద్వారా పార్టీలో దళితులకు ప్రాధాన్యత లేదన్న విషయాన్ని చెప్పదల్చుకున్నారా అంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ నుంచి ఇద్దరు మాత్రమే మంత్రులు ఉన్నారు. ఒకరు తాడేపల్లిగూడెంకు చెందిన పైడికొండల మాణిక్యాలరావు కాగా మరొకరు కృష్ణాజిల్లా కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్. కృష్ణా జిల్లాలో కామినేని శ్రీనివాస్ ను పక్కనపెట్టి టీడీపీకి చెందిన జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు జెండా వందనం చేసే అవకాశం ఇస్తూ వస్తున్న ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చేసరికి దళిత వర్గానికి చెందిన సుజాతను తప్పించి మాణిక్యాలరావుకు అవకాశం ఇస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. మరి ఈ విమర్శలపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.