Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

who is a Brahmin?

By   /  February 24, 2016  /  Comments Off on who is a Brahmin?

    Print       Email

బ్రాహ్మణుడు అంటే ఎవరు?
HYF28GURAZADA_1219322esub

నేను ఇంతకు ముందు తెలియ చేసిన భారతంలోని అరణ్య పర్వంలోని నహుషుడి కథ,ధర్మవ్యాదుడి కథ,యక్ష ప్రశ్నలు మరియూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘ఇలాంటి తవ్వాయి వస్తే’అనే కథలోనూ బ్రాహ్మణుల కుల ప్రస్తావన వచ్చింది.బౌద్ధమతం ప్రాబల్యాన్ని తగ్గించటం కోసం ఆది శంకరుల కాలం నుండి హిందూ మతంలో కూడా ఈ సన్యాసితత్వం వచ్చింది.బుద్ధుడిని అనుకరించారు, అనుసరించారు,కానీ బౌద్ధంలో ఉన్న మంచి విషయాలను వదలివేసారు.మన సంఘ జీవనానికి మతం,కులం అడ్డు కాకూడదు.అదీ,అసలు’ఇలాంటి తవ్వాయి వస్తే’ కథలోని గొప్పతనం! బ్రాహ్మణత్వాన్ని నిర్ణయించేది కులమా? గుణమా? అని ఎవరైనా నన్నడిగితే గుణమే అని నిస్సందేహంగా చెబుతాను.ఒక వ్యక్తి పుట్టుకతో బ్ర్రాహ్మణుడై ఉండవచ్చు. కాని అతనిలో అహంకారం, దర్పం,విచ్చలవిడి జీవితం, విలాసాలమీద కోరికలు, అబద్దపు నడవడిక ఉంటే అతడు బ్రాహ్మణుడుగా పరిగణించబడడు.ఇంకొకడు ఇతరకులాలలో పుట్టినప్పటికీ, అతనిలో ఈ లక్షణాలు లేకపోతే అతన్ని బ్రాహ్మణుడుగానే పరిగణించవచ్చు. ఇక బ్రాహ్మణకులంలో పుట్టి, పై దుర్గుణాలు లేనివాని మాట చెప్పేదేమున్నది? అతను అత్యుత్తముడు! బ్రాహ్మణత్వం అనేది కులాన్ని బట్టి కాకుండా గుణాన్ని బట్టి నిర్ణయించ బడుతుందని అరణ్యపర్వంలోని కథల ద్వారా తెలుసుకున్నాం. పుట్టుకతో వచ్చిన ఈ లక్షణాలను వారు అభ్యాసంద్వారా చక్కగా వృద్ధిచేసుకోకపోతే అవి దుస్సాంగత్యదోషంవల్లా, కుహనాగురువుల వల్ల క్రమేణా నశించిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ‘కులబ్రాహ్మణులను’ ప్రస్తుతం కొంతమందిని మనం చూస్తున్నాము.కులం ప్రధానం కాదు, గుణమే ప్రధానం అన్నది నిర్వివాదాంశం.బుద్ధుడు కూడా ఇదే భావనను ధమ్మపదంలో అనేక చోట్ల వెలిబుచ్చాడు. అంతేకాదు నిజమైన మహనీయులందరూ ఇదే భావనను ఒప్పుకున్నారు. బౌద్ధం వేరు,హిందూమతం వేరు అని చెప్పగానే సరిపోదు.బౌద్ధాన్ని ప్రస్తావించటానికి కారణం,’అంటరానితనాన్ని’ గురించి తెలియ చేయటం కోసమే! కులానికీ గుణానికీ మధ్యన నిర్ణయం జరుగవలసి వచ్చినపుడు గుణానికే ప్రాధాన్యం ఇవ్వాలి అన్నది నిర్వివాదాంశం.ప్రతివారూ వేదాలు ,ఉపనిషత్ లు గొప్పవని చెబుతుంటారు.అందులో ఏమున్నాయో తెలియదు.తెలుసుకొని వాటిట్లో ఏమున్నాయో చెప్పటానికి ప్రయత్నించరు.మనకు తెలియనవి అన్నీ గొప్పవని భావించే వారి మూర్ఖత్వాన్ని చూసి జాలి కలుగుతుంది.మనం చెప్పే సంప్రదాయాల మీద మనకే విశ్వాసం ఉండదు.పైగా గుండు కొట్టించుకొని పిలక పెట్టుకోవటం ‘బ్రాహ్మణత్వానికి’ఒక ముఖ్య సంకేతంగా వెలిబుచ్చాడు ఒక పెద్ద మనిషి.ఆ మహనీయునికి ఇవే బ్రాహ్మణ లక్షణాలుగా కనిపించటం దురదృష్టం.వీరినే నూతిలోని కప్పలుగా,ఇసుకలో తలదూర్చి నిజాన్ని చూడలేని ఉష్ట్ర పక్షులుగా భావించవచ్చు. నిజమైన బ్రాహ్మణుడుననే కుల దురహంకారంతో ఉన్న ఆ పెద్దమనిషి గుండు కొట్టించుకొని పిలక పెట్టుకున్నాడా? వారికి మనం చెప్పేవే అర్ధం కావు.వేదాలు,ఉపనిషత్ ల సంగతి ఎందుకు? బూడిద సృష్టించే(?) వారిని దైవమనే నమ్మే వారికి వాస్తవ ప్రపంచంలో, వర్తమానంలో నివసించటం తెలియదు, చేతకాదు.అటువంటి వారి మూర్ఖత్వాన్ని చూసి జాలి మాత్రమే కలుగుతుంది. ఏ మాత్రం ద్వేషం కలుగదు . నేటి నుండైనా వర్తమానంలో జీవించి విశాల భావాలతో జీవితాన్ని పరిపూర్ణం చేసుకోమని అటువంటివారికి నా హిత వచనం. Emergency విధించిన తరుణంలో శ్రీమతి ఇందిరా గాంధికి శ్రీ చంద్రశేఖరసరస్వతీ స్వామి వారు దర్శనం ఇవ్వలేదు.మరి నేటి చాలామంది పీఠాధిపతులు’అనుగ్రహభాషణం’ చేసేది(అవినీతిపరులైన)రాజకీయ నాయకులతోనే!హిందూ మతంలోని కుల వ్యవస్థను గురించి,అంటరానితనం హిందూమతంలో లేదని ధర్మోపన్యాసాలు చేసే స్వాములు బ్రాహ్మణ కులస్తుల వద్దనే బిక్ష ఎందుకు తీసుకుంటారు?దానికి ఆ ప్రబుద్ధుడి సమాధానం–స్వాముల వారు స్వీకరించే “భిక్ష” మనల్ని ఉద్దరించటానికేనట! వారి భుక్తికి కాదట ! ఆఖరకి అతను తెలిపింది,నేను చెప్పినదే!— స్వాములు బ్రాహ్మణుల వద్దనే బిక్షను స్వీకరిస్తారని! కాకపొతే, ఆ ప్రబుద్ధుడు స్వాములు బిక్ష తీసుకునే బ్రాహ్మణులకు ఒక కొత్త నిర్వచనం,వేషాన్ని(uniform and dress codeని) ఆయన నిర్వచించాడు. మరి ఈ నిర్వచనం ఏ వేదంలోనిదో?ఏ ఉపనిషత్ లోనిదో?భక్తి ఒక స్థాయిమించితే,దానిని మించిన మత్తుమందు మరొకటి ఉండదు.ఆ మత్తులో ఉన్నవారు వాస్తవ ప్రపంచంలో,వర్తమానంలో జీవించలేరు.అరవిందుని,రామతీర్థ స్వామిని,రమణ మహర్షిని,వివేకానందుని,శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామిని ఎవరూ విమర్శించరు. వారి జీవనం అంత ఆదర్శవంతమైనది.సమస్య అల్లా ‘నిత్యానంద’మరియూ అటువంటి ఇతరులతోనే!ఎన్ని ఆశ్రమాలలలో ఎన్ని Sex Scandals ను గురించి మనం వినలేదు?మనిషి కాషాయ వస్త్రాలను ధరించినంత మాత్రం సరిపోదు,మనసు’కాషాయం’కావాలి.
​ఆశ్రమాలలో హత్యలు జరిగిన సంఘటనలు మీకు గుర్తు లేదా? మతసహనం చాలాముఖ్యం.చికాగోలో ఉపన్యాసాలు ఇచ్చిన వివేకానందుడు,ఈ దేశం యొక్క గొప్పతనం గురించి చెబుతూ, “ప్రపంచానికి సహనం అంటే ఏమిటో తెలియ చేసిన దేశం భారతదేశం.ఎన్నో మతాలను,విశ్వాసాలను ఆహ్వానించిన దేశం, భారతదేశం.యోగులకు ,మహర్షులకు జన్మస్థలమైన కర్మభూమి,పుణ్యభూమి, భారత దేశం.—“ఇలా సుదీర్ఘంగా సాగుతుంది ఆయన ఉపన్యాసం.ఆయన ఉపన్యాసం అంతా చదివిన తరువాత నాకు అనిపించింది–వివేకానంద భారతదేశాన్ని, హిందూమతాన్ని విడదీసి చూడలేదని!అదే బాటలోనడిచి, ఆ తరువాత మనకు లభించిన శ్రీ రామతీర్థ కూడా చిరు ప్రాయంలోనే మరణించటం జరిగింది.అప్పటి నుండి చాలా మంది స్వాములు ,పీఠాధిపతులు అవధూతలు వచ్చారు.కానీ,వారు వివేకానందుని లాగా,రామతీర్థ లాగా–ప్రజలలోకి చొచ్చుకొని పోయి ప్రజలను జాగృత పరచటంలో పూర్తిగా వైఫల్యం చెందారు అని చెప్పటంలో ఎటువంటి దురుద్దేశ్యం లేదు.వేదికనెక్కి గంటలకు గంటలు ఏది పడితే అది అనర్గళంగా మాట్లాడే ఈ సాధుపుంగవులు ప్రజలను ఎందుకు చైతన్యవంతులను చెయ్యటానికి ప్రయత్నించరు?ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే చాలా రోజులనుండి నేను ఒక విషయం గమనిస్తున్నాను.మన పీఠాధిపతులు హైదరాబాదు లాంటి నగరానికి వస్తే,వారి ఉపన్యాసం వినటానికి వారి దర్శనం చేసుకోవటానికి ఎంత మంది వస్తారో మన అందరికీ తెలిసిందే!ఈ మధ్యనే,కంచి స్వామి గుంటూరుకి వచ్చారు.ఆయన చుట్టూ కేవలం ఒక రెండు వందల మంది మాత్రమే ఉన్నారు.అందులో ఒక నూటయాభైమంది ‘జాతి బ్రాహ్మణులు’,ఇరవయ్యి మంది వైశ్యులు,మిగిలిన వారు అన్యకులస్తులు ఉన్నారు.నాకు మరో విషయం తెలిసింది కూడా,వారి వెంట ఉన్న వారిలో 30 మంది దాకా వారి ఆశ్రమం నుండి వచ్చిన వారేనట ! అంటే,హిందూమతంలోనే ఉన్న చాలామంది కులస్తులకు మతమన్నది కేవలం అగ్రకులాలకు సంబంధించింది,మనకెందుకు?అనే భావం పూర్తిగా ఏర్పడింది.ఇది ముమ్మాటికీ నిజం.దీనికి కారణం ఏమిటి? ‘నాలుగు పడగల హైందవ నాగరాజు’ ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాడా?వీటన్నిటికీ కారణం ఏమిటి?ఎప్పుడైనా ఆలోచించారా?ఈ కుహనాస్వాములు మనకు ‘అద్వైతాన్ని’ గురించి బోధిస్తుంటారు!120 సంవత్సరాల ముందు వచ్చిన ప్రపంచపు గొప్ప నాటకాలలో ఒకటైన ‘కన్యాశుల్కం’లో అనేకమైన బ్రాహ్మణ పాత్రలు ఉన్నాయి. అగ్నిహోత్రావధాన్లు,బుచ్చమ్మ,లుబ్ధావధానులు,రామప్ప పంతులు,గిరీశం, సౌజన్యారావు పంతులు గారు మొదలైన ముఖ్య పాత్రలను తీసుకొని విశ్లేషించుకుందాం.
అగ్నిహోత్రావధాన్లు–పిలక పెట్టుకొని విభూతి రాసుకొని త్రికాల సంధ్యలు, అగ్నిహోత్రం చేస్తాడు ఈయన.నిత్య నైమిత్తిక కర్మలను యధావిధిగా ఆచరిస్తూ ఉంటాడు.
ఇంటిలో ఒక బాలవితంతువైన ఒక కూతురిని పెట్టుకొని,మరో కూతురిని(బాలికను)డబ్బులకు అమ్ముకునే దౌర్భాగ్యుడు అయిన అగ్నిహోత్రావధానులు బ్రాహ్మణుడా?
లుబ్ధావధానులు-చావుకు కాళ్ళు చాచుకొని,జ్యోతిష్యాన్ని నమ్ముకొని నాలుగో పెళ్ళికి సిద్ధపడి ,డబ్బులిచ్చి ఒక బాలికను వివాహ మాడటానికి సిద్ధపడ్డ,ఇతనూ బ్రాహ్మణుడేనా? ఇతని ఇంటిలో కూడా ఒక బాల వితంతువైన కూతురు ఉంది.
రామప్ప పంతులు–లౌక్యానికి,మోసానికి తేడాను తెలిపిన ఘనుడు ఈయన.అందిన చోటల్లా కమీషన్ రాబట్టుకుంటాడు.వేశ్యాలోలుడు.ఆ వేశ్యలకు డబ్బులు కూడా ఇవ్వడు.లుబ్ధావధానులు యొక్క విధవకూతురితోనూ,పూటకూళ్ళమ్మతోనూ,మధురవాణితోనూ ..ఇలా చాలా మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు గలవాడు ఇతడు. ఆ మాటకొస్తే,పురుషులతో కూడా సక్రమమైన సంబంధాలు ఉండవు ఇత గాడికి.మరి,ఇతడు కూడా బ్రాహ్మణుడేనా?
గిరీశం–శీలంలేని ఒక ఆషాఢభూతి ఇతడు!మరి ఇతడూ బ్రాహ్మణుడేనా?
సౌజన్యారావు పంతులు గారు–సంస్కరణాభిలాషి.నిజాయితీపరుడు.శీలవంతుడు.నిత్య నైమిత్తిక కర్మలను వేటినీ ఆచరించడు.జీవితమే ఒక యోగం,యాగంగా గడిపిన మహనీయుడు.సహజంగా జీవించటం,అందరినీ సమదృష్టితో చూడటంతెలిసిన,ఈ మహనీయుడే నిజమైన బ్రాహ్మణుడు.శ్రీ గురజాడ వారు ,ఆనాటి
కొంతమంది జాతి బ్రాహ్మణులకు ఉన్న అహంకారాన్ని దృష్టిలో ఉంచుకొని,ఒక వేశ్య అయిన మధురవాణి చేత,సౌజన్యారావు పంతులు గారిని ఉద్దేశించి,ఇలా అనిపిస్తారు—“బ్రాహ్మణులలో కూడా గొప్ప వారుంటారన్న మాట!”ఎంత వ్యంగ్యంగా చెప్పి కొరడా ఝళిపించి ‘కుహనా బ్రాహ్మణులకు’దేహశుద్ధి చేసారు!
అయినా,నేటికీ కొంతమందికి ఇంకా ‘కుల దురాహంకారం’ పోలేదు. అన్నట్లు మరిచాను,ఇంత గొప్ప నాటకం వ్రాసిన శ్రీ గురజాడ వారిని మించిన ‘బ్రాహ్మణుడు’ వేరే ఉంటాడా?’ఇలాంటి తవ్వాయి వస్తే’కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు నిజమైన బ్రాహ్మణుడు.అంతదాకా ఎందుకు సంస్కరణాభిలాష కల ప్రతివాడు బ్రాహ్మణుడే! ఒకసారి చరిత్రను పరిశీలించండి,బ్రాహ్మణుడంటే ఎవరో మీకే తెలుస్తుంది!

InCorpTaxAct
Suvidha

 

టీవీయస్.శాస్త్రి
878_TVS shastry

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →