బాబు వ్యూహాన్ని కనిపెట్టిన జగన్?
ప్రత్యేక హోదా అవసరం ఆంధ్రప్రదేశ్‌కు ఎంత ఉందో అందరికీ తెలిసిందే. అయితే హోదా విషయంలో అధికారపక్షం, ప్రతిపక్షాలు రెండూ కూడా ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. కాగా కేంద్రం ప్రత్యేక హోదా ఇక ఇవ్వదు అనే నిర్ణయానికి రావడంతో తెలుగుదేశం పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. అయితే ఆ వ్యూహాన్ని ప్రతిపక్ష పార్టీ పసిగట్టింది. వివరాల్లోకి వెళ్లితే… హోదా రాదని జనాలకు దాదాపు స్పష్టమయినందున దాని బదులు ప్యాకేజీ కోసం తమ పార్టీ పోరాడుతుందన్న సంకేతాలిచ్చే పనిలో తెలుగుదేశం పార్టీ బిజీగా ఉంది. తాజాగా ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఈ అంశాన్ని విశ్లేషిస్తూ….ఏపీకి ప్యాకేజీ మాత్రమే ఇస్తారని హోదా ఇచ్చే పరిస్థితి లేదని వెల్లడించారు. తాము కూడా దాని కోసం పట్టుపట్టే పరిస్థితిలో లేమని అన్నారు. ప్రజలు కూడా ఏదో ఒకటి వస్తే చాలనుకుంటున్నారే తప్ప హోదా గురించి పట్టుదలతో లేనందున ప్యాకేజీ వచ్చినా సంతోషిస్తారని విశ్లేషించారు. హోదా ఇవ్వకపోయినా దానికంటే ఎక్కువ ఉపయోగం ఉన్న ప్యాకేజీ ఇవ్వాలన్న వాదన తెరపైకి రావడం వెనుక మతలబు కూడా అదేనని చర్చ జరుగుతోంది. వారం క్రితంవరకూ హోదాపై పోరాటం పేరుతో హడావుడి చేసిన టీడీపీ నాయకులు కొద్దిరోజులుగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
హోదా ఇవ్వకపోతే బీజేపీ నేతలను రాష్ట్రంలో అడుగుపెట్టనీయవద్దని ఆ పార్టీతో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేసిన నేతలంతా ఇప్పుడు మౌనం వహించడం అన్ని వర్గాలను విస్మయపరుస్తోంది. అయితే కేంద్రం నుంచి ప్యాకేజీకి సంబంధించి కచ్చితమైన హామీ వచ్చిన తర్వాతనే టీడీపీ వ్యూహం మార్చుకుందని సమాచారం. ప్యాకేజీపై హామీ లభించినందున హోదాపై ఇక ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నాయకత్వం నేతలను ఆదేశించిందని తెలుస్తోంది. నిజానికి కీలకమైన అంశాలపై టీడీపీ రాష్ట్ర కార్యాలయమే ఒక నోట్ రూపొందిస్తుంది. దానిని ఆయా జిల్లా పార్టీ కార్యాలయాలకు ఉదయం టీవీ చర్చలకు వెళ్లే నేతలకు ఆ రోజు విలేఖరుల సమావేశాలు నిర్వహించేవారికి పంపిస్తుంటుంది. ఆ ప్రకారంగా ఏ మోతాదులో విమర్శలు ఉండాలి? ఎవరిని ఎక్కువగా విమర్శించాలి? అన్న అంశం పార్టీ కార్యాలయమే నిర్ణయిస్తుంది. హోదాపై టీడీపీ నేతలు వారం రోజులు చేసిన హడావుడి బీజేపీ ప్రధానమంత్రి మోదీపై విమర్శల యుద్ధం అన్నీ పార్టీ విధాన నిర్ణయం మేరకు జరిగినవేనని టాక్. అయితే ప్యాకేజీ పేరుతో ప్రజలను మానసికంగా సిద్ధం చేయాలన్న తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కనిపెట్టారు.
టీడీపీ ప్యాకేజీ అడుగుతుంటే జగన్ మాత్రం హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అంతేకాదు ధర్నాలు, బంద్‌లతో కేంద్రంపై ఒత్తిడిపెంచుతున్నారు. ప్యాకేజీ వల్ల ఏమీ రాదని హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని జగన్ ఢిల్లీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఓటుకునోటు లక్షకోట్ల అవినీతికి పాల్పడినందున బాబు హోదా కోసం పోరాడే అవకాశం లేదని విరుచుకుపడుతున్నారు. ప్యాకేజీని అనుమతించే ప్రశ్న లేదని తమకు హోదానే కావాలని జగన్ గళమెత్తడంతో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకేనన్నది స్పష్టమవుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.