బాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో చంద్రబాబు లేకపోవటం మన అదృష్టం అని వ్యాఖ్యానించారు. లేకపోతే స్వాతంత్ర్యం ఏమైనా సంజీవనా? అని ఉండేవారని..ఇచ్చిన దాన్ని కూడా బ్రిటీష్ వాళ్లు వెనక్కి తీసుకునేవారని వ్యాఖ్యానించారు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉండటం మన కర్మ అన్నారు. జగన్ మంగళవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారమే చంద్రబాబు ప్రత్యేక హోదాను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తందున్నారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు మరచిపోవచ్చేమో కానీ, అయిదుకోట్లమంది ప్రజలు మరచిపోరని అన్నారు. ప్రత్యేక హోదాపై తాము రాజీ లేకుండా పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రత్యేక హోదాపై రాజీపడే ప్రసక్తే లేదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
హోదా కోసం చేపట్టిన రాష్ట్రబంద్ విజయవంతమైందని ఆయన తెలిపారు. బంద్ లో పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని శక్తులు అడ్డుకోవాలని చూసినా బంద్ విజయవంతమైందన్నారు. బంద్ లో పాల్గొన్న సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాలకు వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. లాఠీ దెబ్బలను లెక్క చేయకుండా అక్కచెల్లెమ్మలు బంద్ లో పాల్గొన్నారన్నారు. చంద్రబాబు దగ్గరుండి ప్రజలపైకి పోలీసులను ఉసిగొల్పారని వైఎస్ జగన్ అన్నారు. బంద్‑ను అడ్డుకునేందుకు చంద్రబాబు యత్నించారన్నారు. హోదాకు అనుకూలమైతే బంద్ లో పాల్గొన్నవారిని ఎందుకు అరెస్ట్ చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. హోదాపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా పోరాటం చేయాల్సి రావటం దురదృష్టకరమన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.