ఆ ఎమ్మెల్యేలు ఏమయ్యారు?
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంతమంది ఇటీవల పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే 19 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం విధితమే. అయితే వైయస్ఆర్సీపీలో ఓ వెలుగు వెలిగిన ఆ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన తర్వాత ఎక్కడా బయట కనిపించడం లేదు. కనీసం వాళ్ల వాయిస్ వినిపించడం లేదు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏమయ్యారనే అనుమానం అందరిలో కలుగుతోంది. కాగా పెద్ద తలకాయలుగా ఉన్న కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలతో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన కొద్ది రోజుల వరకు వీరు అక్కడ నానా హంగామా చేశారు. జగన్, వైసీపీని తిట్టిపోశారు. తర్వాత జలీల్‌ఖాన్ లాంటి ఒకరిద్దరు మినహా మిగిలిన వారి వాయిస్ ఎక్కడా వినపడడం లేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎన్నో ఆశలతో, హామీలతో టీడీపీలో చేరిన ఆ నాయకులు తమ హామీలు ఎప్పటకి నెరవేరతాయా అని ఆశానిరాశలతో ఉన్నట్లు సమాచారం. పార్టీ మారిన వారిలో కొందరికి మంత్రి పదవులు వస్తాయన్న హామీలు, ఆశలు ఉండడంతో వారి టెన్షన్ అంతా ఇంతా కాదట.
టీడీపీలో చేరిన సీనియర్ నాయకుల్లో భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, సుజయకృష్ణ రంగారావు వంటి వారు ఉన్నారు. వీరు పదవుల టెన్షన్లో ఉన్నారు. ఇక వీరితో పాటు పార్టీలు మారిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు చెప్పారు. కాగా మంత్రి పదవులు ఆశించి పార్టీలో చేరిన వారు మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారట. వీరు తమ వాయిస్ కూడా పెద్దగా వినిపించడం లేదన్న టాక్ వస్తోంది. ఇక అభివృద్ధి పనుల్లో కోట్లు వచ్చి పడతాయని అనుకున్న ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో నిధులు రాకపోవడంతో వారు సైతం అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.