వైయస్ఆర్సీపీ ఎంపీల దీక్ష భగ్నం
* ఆరోగ్యం విషమించిందన్న డాక్టర్లు
* బ్లడ్‌షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని పోలీసులకు సమాచారం
* బలవంతంగా వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు
డెక్కన్ అబ్రాడ్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత 6 రోజులుగా చేస్తున్న ఈ దీక్షలో చివరగా మిగిలి ఉన్న ఎంపీలు వైయస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలను ఈ రోజు ఆస్పత్రికి తరలించారు. దీంతో ఢిల్లీ ఏపీ భవన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిల ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయాలని సూచించారు. అయితే, దానికి వారు నిరాకరించడంతో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ బలగాలను అక్కడకు రప్పించారు. బలవంతంగా వారిని దీక్షా స్థలి నుంచి లాగేసి వ్యాన్‌లో ఎక్కించుకుని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిని పోలీసులు తరలించే క్రమంలో ఏపీ భవన్‌ను ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు. ఎంపీల తరలింపును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వైసీపీ శ్రేణులు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. అంబులెన్సులను అడ్డుకుంటున్న వైసీపీ శ్రేణులను బలవంతంగా పక్కకు ఈడ్చేసి ఎంపీలను ఆస్పత్రికి తరలించారు.
కాగా, బుధవారం ఉదయమే అక్కడకు వచ్చిన వైద్యులు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఒంట్లో చక్కెర స్థాయి ప్రమాదకర స్థాయికి పడిపోయాయని హెచ్చరించారు. అవినాష్ రెడ్డి రక్తంలోని చక్కెర స్థాయులు 73కి పడిపోగా, రక్తపోటు 80/60కి క్షీణించింది. ఇక, ఇటు మిథున్ రెడ్డి చక్కెర స్థాయులు 71కి పడిపోయాయి. బీపీ 110/70 ఫర్వాలేదనిపించే స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ దీక్ష కొనసాగిస్తే ప్రమాదకరమని భావించిన వైద్యులు.. ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేయించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.