రాష్ట్ర బంద్‌కు వైయస్ఆర్సీపీ పిలుపు
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, ప్రత్యేక హోదా ఇస్తామని ఒకరు.. తెస్తామని మరొకరు చెప్పి ఇప్పుడు చేతులు ఎత్తేయడాన్ని నిరసిస్తూ శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గురువారం ఉదయం టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అక్కడి నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏవిధంగా అన్యాయం చేశారో అదేవిధంగా ఇప్పుడు అన్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా తెలిపారన్నారు. జైట్లీ, చంద్రబాబు కలిసి ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు వస్తాయని, ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం ఉండదని జగన్ వివరించారు. ప్రత్యేక హోదా వస్తేనే వేలకొద్ది పరిశ్రమలు వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఖచ్చితంగా అవసరమేనన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ యువత ఆశలపై జైట్లీ నీళ్లు చల్లారని జగన్ మండిపడ్డారు. జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించడాన్ని జగన్ తప్పుబట్టారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ తో ఆట లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగా ఏపీ బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. బంద్ కు సంబంధించి వామపక్ష నాయకులతో కూడా మాట్లాడినట్లు జగన్ వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఈ బంద్‌కు అందరి మద్ధతు కావాలని, అందరం కలిసి వస్తేనే ప్రత్యేక హోదా సాధించుకోగలమన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.