వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా?
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎంతటి తీవ్ర పోరా టాలు చేసినా, జనం మదిలో ముద్రవేసుకోకపోతే వచ్చే ఫలితం శూన్యమని వైసీపీ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేసుకోవాలంటే ప్రజలపై తమదైన ప్రత్యేక ముద్రవేసుకోవడం ఎంతో అవసరమని వైసీపీ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో `గడప గడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ` అన్న నినాదంతో ప్రజల దగ్గరకి వెళ్లి వారికి మరింత చేరువ కావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గడప గడపకు కార్యక్రమాన్నిప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ దానిని విజయవంతంచేసేందుకు వీలుగా ఈ నెలాఖరు లేక జులై తొలివారంలో మరోసారి పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యనేతలు సైతం ధృవీకరిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ముఖ్యనేతలు, అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జ్లతో ఈ సమావేశాన్ని జగన్ నిర్వహించనున్నారు. జనంలోకి ఏ నినాదంతో వెళ్లాలి, వారిలో పార్టీ ముద్ర ఏ విధంగా వేయాలని అన్న దాని చుట్టే చర్చ సాగేలా ఈ విస్త్రుత స్థాయి సమావేశం ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. ఆ దిశగా ప్రత్యేక కార్యచరణతో ఈ విస్త్రుత స్థాయి సమావేశంకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు గత విస్త్రుత స్థాయి సమావేశంలో పార్టీని గ్రామ, మండల స్థాయిల్లోనూ బలోపేతం చేసేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఆ దిశగా కూడా వైసీపీ కసరత్తు మొదలెట్టినట్లు సమాచారం. ఈ కమిటీల నియామక బాధ్యతలను జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులకు, ఇన్ఛార్జ్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గాలతోపాటు పార్టీకి ఎమ్మెల్యేలు లేని చోట కూడా గ్రామ, మండల, గ్రామ స్థాయి కమిటీల నియామకాలు అసంపూర్తిగా ఉంటే వెంటనే వాటిని భర్తీచేపట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షులకు పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.